క్షమించమ్మ /forgive me

క్షమించమ్మ


అప్పాలరెడ్డి


నీలోనే పుట్టాను నీలోనే పెరిగాను
వేటనే జీవనాధారంగా చేసి ముందుకు నడిచాను
ఆకలేసినప్పుడల్లా జీవాలను జిహ్వానికి బలి చేశాను
ఎండ సెగలు వంటికి సోకగానే చెట్టు కొమ్మలని 
ముక్కలై గుడిసెలై నిలిచేలా చేశాను 


అడుగుపెట్టిన చోటల్లా నవీనత అంటూ
నీ అందాని బద్దలు కొట్టాను 
నీలో ఉన్న ధర్మాలను ఒక్కొక్కటి నేర్చుకున్నాను అని అనుకున్నాను
నిప్పు పుట్టించాను నాగరికతను రగిలించాను
చీకటనే అజ్ఞానాన్ని వదిలి కాంతి మార్గాన ప్రయాణం ఆరంభించానని అనుకున్నాను 


కదిలే కాలానికి చక్రాలను కట్టి ముందుకు నడిపాను
జోరు పెరిగింది చక్రాలు యంత్రాలై ముందుకు నడిచాయి
వేగానికి తోడుగా పొగ గొట్టాలను 
నీ ఊపిరితిత్తులకు బిగించాను
ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు ప్రాణాలనే హరించాను


రసాయనాలు తీసి నీ ఒంటి నిండా చల్లాను 
నీ చర్మానికి తూట్లు పొడిచారు
నీపై గడ్డి కూడా మొలవనీయక అణ్వస్త్రాలు ప్రయోగించాను
అధికారం అగ్రస్థానం అనే వాటికోసం 
నిరంతర యుద్ధాలు చేశాను
నిన్ను వెచ్చని నెత్తుటితో  స్నానం ఆడించాను


నాకంటే ముందు పుట్టి ఈ ప్రకృతిలో భాగమైన ఎన్నో జీవరాసులను ఒక్కొక్కటిగా నిర్మూలించాను
తప్పని చెప్పక నా బిడ్డ భవిష్యత్తు 
అంటూ మౌనంగా ఉండిపోయావు
ప్రశ్నించని ఆ మౌనమే నేడు రోగమై నన్ను చుట్టూ ముట్టింది


సమాధానం లేని ఎన్నో తప్పులు ప్రశ్నగా 
నిలిచి నిత్యం వేధిస్తూనే ఉన్నాయి
గడపదాటి అడుగు తీసి బయటకు వెయ్యటానికి 
కూడా ధైర్యం చాలని పిరికివాడిని అయిపోయాను
నీ ముందు మోకరిల్లి తప్పు చేశానని ఒప్పుకున్నా 
సరిపోదేమో నేను చేసిన పనులకి.....!

                                                           -- అప్పలరెడ్డి

Comments

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi